Revanth Reddy : డీ లిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ ఓన్లీ సౌత్
డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు;

డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. డీలిమిటేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద విధానాలను ఆయన ఎండగట్టారు. రాష్ట్ర విభజన సందర్బంగా కూడా పెట్టిన ఏపీ, తెలంగాణలలో శాసనసభ సీట్లు పెంచాలని పెట్టినా అది చేయలేదని తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం సీట్ల సంఖ్య పెంచడం రాజకీయం కోసమేనని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపంకాదన్న రేవంత్ రెడ్డి సీట్ల పెంపునకు జనాభా ప్రాతిపదిక కాకూడదని అన్నారు.
త్వరలో హైదరాబాద్ లో సమావేశం...
అసలు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని కొందరు మంత్రులు అంటున్నారని, అది సత్యదూరమని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచాలని రేవంత్ రెడ్డి కోరారు. డీ లిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ ఓన్లీ సౌత్ లగాకనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని ఆయన తెలిపారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని రేవంత్ రెడ్డి కోరారు. త్వరలోనే హైదరాబాద్ లో డీ లిమిటేషన్ పై సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందరూ కలసి కట్టుగా తమ ప్రయత్నానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.