భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రొటీన్ కు భిన్నంగా విపక్ష నేత హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ప్రశంసల..
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. అధికార - విపక్షాల మధ్య వాడి-వేడి చర్చ జరుగుతుంది. కానీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రొటీన్ కు భిన్నంగా విపక్ష నేత హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రసంగించిన సందర్భంగా భట్టి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమంపై సానుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
'భట్టి గారు మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు. భట్టి గారు ఈ సారి ఓ మంచి మాట చెప్పారు. భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి. పార్లమెంట్ కి పంపాలి' అని కేసీఆర్ అన్నారు. జాతీయ స్థాయి అంశాలపై భట్టి విక్రమార్క గట్టిగానే కాకుండా అవగాహనతో మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పార్లమెంట్‌కు పంపాలని తాను అంటున్నానని కేసీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. విపక్ష నేతపై కేసీఆర్ ప్రశంసలు కురిపించడంతో సభలో కొద్దిసేపు ఆహ్లాదకర వాతావరణం కనిపించింది.