దాని కోసమే ఆ సినిమా : "ది కశ్మీర్ ఫైల్స్" పై సీఎం కేసీఆర్ స్పందన
తాజాగా "ది కశ్మీర్ ఫైల్స్" సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను..
హైదరాబాద్ : "ది కశ్మీర్ ఫైల్స్" ప్రస్తుతం భారత్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. భారీ వసూళ్లు రాబడుతోన్న చిత్రం. ఈ సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ ఈ సినిమా చూడాలని కూడా సూచించారు. తాజాగా "ది కశ్మీర్ ఫైల్స్" సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ సినిమాను విడుదల చేశారని ఆరోపించారు.
శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ సినిమాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. నాడు కశ్మీర్ లో పండిట్లను ఊచకోత కోసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది? అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశానికి కావాల్సింది "ది కశ్మీర్ ఫైల్స్" సినిమా కాదని.. డెవలప్ మెంట్ ఫైల్స్ కావాలని కేసీఆర్ తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేయడంపై పీఎం దృష్టి పెట్టాలని, సినిమా పై దృష్టి పెట్టడం అవసరం లేదని స్పష్టం చేశారు.