గల్ఫ్ హామీల అమలుపై సీఎం రేవంత్ దృష్టి

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల రెండవ లేదా మూడవ వారంలో విడుదల కావచ్చని వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలలో హడావుడి మొదలైంది

Update: 2024-03-06 11:17 GMT


 



కోటి ఓటు బ్యాంకు కలిగిన గల్ఫ్ కుటుంబాలు 

◉ సీఎం రేవంత్ దుబాయి పర్యటనకు ఆహ్వానం 

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల రెండవ లేదా మూడవ వారంలో విడుదల కావచ్చని వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలలో హడావుడి మొదలైంది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్ లోక్ సభ నియోజకవర్గాలలో ఒక మోస్తరు ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా గణనీయంగా గల్ఫ్ వలసలు ఉంటాయి కానీ ఇక్కడ ఎంఐఎం ప్రభావం ముందు ఏ లెక్కలు పనిచేయవు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. 

గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు నివసిస్తున్నారని ఒక అంచనా. ఒక గల్ఫ్ ప్రవాసికి తన కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారు 60 లక్షలు అవుతారు. గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు వీరికి తోడైతే ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్నట్లే. 

ఇటీవల ప్రధాని మోదీ అబుదాబి బహిరంగ సభలో ప్రసంగించడం, బాప్స్ హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం వలన ప్రవాస భారతీయులు బీజేపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఇతర రాజకీయ పార్టీలు గమనించాయి. గల్ఫ్ దేశాలలో నివసించే తెలంగాణ ప్రవాసులను ఆకట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తో దుబాయిలో ఒక సభ నిర్వహించాలని టిపిసిసి ఎన్నారై సెల్ ప్రతిపాదించింది. దుబాయి లో సెలవు రోజు అయిన ఏదో ఒక ఆదివారం మార్చి 24, 31 లేదా ఏప్రిల్ 7 తేదీలు అనుకూలంగా ఉంటాయని  సూచించినట్లు సమాచారం.  

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు 

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాస భారతీయులు విధానం) తో కూడిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మార్చి నెలలో సీఎం దుబాయి పర్యటనకు రావాలని వారు ఆహ్వానించారు. 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఎన్నారై కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags:    

Similar News