నేడు తెలంగాణకు రాహుల్.. 5 లక్షల మందితో రైతు సంఘర్షణ సభ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో..
హైదరాబాద్ : కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేటి సాయంత్రం ఢిల్లీలో బయల్దేరి.. తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ప్రత్యేకవిమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు స్వాగతం పలుకుతారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న రైతు సంఘర్షణ సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఈ సభకు 5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సభలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు.
మే7, శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ముగుస్తుంది.