జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు పది వేల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని.. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను..
జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ లో వరద బాధితులకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ లో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు పది వేల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని.. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మూడు వైపుల నుంచి ఏకకాలంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడించారు. లిబర్టీ చౌరస్తా, ఆదర్శనగర్, ట్యాంక్ బండ్ మూడు ప్రాంతాల నుంచి ఒకే సమయంలో జీహెచ్ఎంసీ వైపుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూసుకు వచ్చారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయం గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు.