రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
తాజాగా రోడ్డుపై ప్రయాణిస్తోన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగలు..
హైదరాబాద్ లో జరుగుతోన్న వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్సులు, ఫ్యాక్టరీల్లోనే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కార్లు, బస్సుల్లోనూ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా రోడ్డుపై ప్రయాణిస్తోన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు, పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. ప్రయాణికులను దింపేయడంతో ప్రమాదం తప్పింది.
కాగా.. రన్నింగ్ బస్సులో మంటలను చూసి వాహనదారులు కంగారుపడ్డారు. టీఎస్ఆర్టీసీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు బేగంపేట్ మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి జేబీఎస్ వెళ్తుండగా.. బస్సు పై భాగంలో ఉన్న ఏసీ నుండి మంటలు చెలరేగాయి. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కాగా ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు.