గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 33 మందికి అస్వస్థత
ఘటన గురించి తెలిసిన వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విద్యార్థినులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి..
వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. గత రాత్రి విద్యార్థినులంతా భోజనం చేశాక.. లీడర్ తినేటపుడు భోజనంలో బల్లి పడినట్లు గుర్తించింది. కొద్దిసేపటికే విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మొత్తం 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా.. వారిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారందరినీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విద్యార్థినులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. అక్కడున్న విద్యార్థినులతో మాట్లాడగా.. అందరూ భోజనం చేశాక.. ఆఖరిలో లీడర్ తినే సమయంలో బల్లిని గమనించిందని, వార్డెన్‌తో చెబితే తీసేశారని చెప్పారు. ఆ తర్వాత తమందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయయని విద్యార్థినులు వివరించారు. ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వర్థన్నపేట ఆస్పత్రిలో కనీస వసతులు లేవని, తమ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.