Revanth Reddy : దేవుడి పేరుతో దరఖాస్తు.. నన్ను ఆదుకోవయ్యా రేవంతూ.. అంటున్న శివయ్య
ఆరు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరిన ప్రభుత్వానికి ఒకే ఒక్క దరఖాస్తు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనకు నెల రోజులు పూర్తయింది. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ప్రజా పాలన కార్కక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించింది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్య ఇలా ఒక్కటేమిటి కోటికి పైగానే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రజలు అధికారుల వద్దకు పరుగులు తీయకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
దేవుడి పేరిట...
ఆరు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరిన ప్రభుత్వానికి ఒకే ఒక్క దరఖాస్తు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది. అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. ఏకంగా దేవుడి పేరిట ఒక దరఖాస్తు రావడంతో ముక్కున వేలేసుకున్నారు. శివయ్య అనే పేరుతో వచ్చిన ఈ దరఖాస్తులో భార్య పేరు పార్వతమ్మ, కుమారుల పేర్లు వినాయకుడు, కుమారస్వామిలుగా పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామం నుంచి ఈ దరఖాస్తు అందింది.
ఆలయ అభివృద్ధి కోసం...
అయితే ఈ దరఖాస్తును ఆ గ్రామంలో ఉన్న త్రికూటేశ్వర స్వామి ఆలయం ఛైర్మన్ ఏనుగు సురేందర్ రెడ్డి అధికారులకు అందచేసినట్లు గుర్తించారు. గత కొన్నాళ్లుగా ఈ ఆలయ అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ పట్టించుకోక పోవడంతో ఏకంగా శివయ్య పేరిట దరఖాస్తును అధికారులకు సురేందర్ రెడ్డి సమర్పించాడు. పన్నెండో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే దేవుడు శివయ్య పేరిట ఈ దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.