పర్యాటక కేంద్రంగా గుండాల!?

నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, గుండాలలోని కాకతీయ శిల్పాలు, శాసనం, ఆలయాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

Update: 2024-02-24 12:00 GMT

నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, గుండాలలోని కాకతీయ శిల్పాలు, శాసనం, ఆలయాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో, మండల కేంద్రమైన వెల్దండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల చారిత్రక ప్రాధాన్యత గల గ్రామమని, అంబారామలింగేశ్వరాలయం పక్కనున్న సహజ సిద్ధమైన కోనేరులు(గుండాలు) చరిత్ర పూర్వ యుగానికి చెందాయని, స్థానికులు మాత్రం అవి రాముని బాణం వేయగా ఏర్పడినవని నమ్ముతారని, రామాయణంతో సంబంధం ఉన్న వీటిని పరిరక్షించాలన్నారు.



వారసత్వ సంపదను కాపాడటానికి గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా శివనాగిరెడ్డి శనివారం నాడు గుండాల అంబారామలింగేశ్వరాలయాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఆలయం ముందున్న కాకతీయ శాసనం పై అక్షరాలు చెరిగిపోయాయని, దాని పైనున్న గుర్తులు ఆ శాసనం కాకతీయులదని తెలియజేస్తున్నాయని, లోపలి ఆలయం వీరగల్లు, నాగదేవత శిల్పాలు, పంచలింగాలు కాకతీయ కాలానికి(క్రీ. శ. 13వ శతాబ్దికి) చెందినవని, మండప స్తంభాలపై వేసిన రంగులు, ఆలయ గోడలపై కొట్టిన సున్నం వాటి ప్రాచీనతకు భంగం కలిగిస్తున్నాయని, రంగులు, సున్నం తొలగించి, గ్రామ చరిత్రకు ఆనవాళ్లు అయిన వీటిని కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గుండాల(కొనేరుల) చుట్టూ భద్రత కల్పించి ఆలయ శిల్పాల చరిత్ర పై ఒక నోటీసు బోర్డు పెట్టి, కొన్ని సౌకర్యాలు కల్పిస్తే, పర్యాటక కేంద్రంగా, శ్రీశైలం వెళ్లి వచ్చే యాత్రికులను ఆకర్షించవచ్చని ఆయన అన్నారు.

Tags:    

Similar News