అతి భారీ వర్షాలు ముంచుకొస్తున్నాయ్..!

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు.

Update: 2023-07-19 02:25 GMT

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భారీ వ‌ర్షాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, కలెక్టరేట్, మండలాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఎండీ జారీ చేసిన రెడ్, ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూడటంపై దృష్టి సారించాలని అధికారుల‌కు సూచించారు.
పరిస్థితిని నిశితంగా పరిశీలించాలనీ, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను శాంతికుమారి ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర కాజ్‌వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లా కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.


Tags:    

Similar News