తెలంగాణలో మూడ్రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ వికారాబాద్, నారాయణపేట్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి..
తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. పలు జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆది, సోమవారాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో వర్షపాతం అంచనాల మ్యాప్ లను విడుదల చేసింది.
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ వికారాబాద్, నారాయణపేట్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
అలాగే ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ అర్బన్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాలోనూ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ.. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.