100 కు ఫోన్ చేసిన యువకుడు.. అతడు చెప్పింది విని షాక్ అయిన పోలీసులు
ఆపదలో ఉన్నాడని ఓ యువకుడి నుంచి డయల్ 100కు కాల్ రావడంతో 7కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నారు దౌల్తాబాద్ పోలీస్..
హైదరాబాద్ : ఆపదలో ఉన్నాడని ఓ యువకుడి నుంచి డయల్ 100కు కాల్ రావడంతో 7కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నారు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. అయితే అక్కడికి వెళ్లిన పోలీసులతో అతడు రెండు బీర్లు ఇప్పించాలని కోరడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వివాహ వేడుకలో ఉన్నానని, మద్యం సరిపోలేదని, తనకు ఇంకాస్త బీరు అవసరమని పోలీసులకు చెప్పాడు. అదే సమయంలో వైన్ షాపులన్నీ మూసేశారని.. తనకు ఇప్పుడు మందు కావాల్సిందేనని ఆ యువకుడు చెప్పాడు.
ఈ పని చేసిన యువకుడిని జనిగాల మధుగా గుర్తించారు. 22 సంవత్సరాల మధు పాఠశాల నుంచి డ్రాప్-అవుట్ అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రజల అవసరాలను పరిష్కరిస్తున్నారని, తనకు బీరు ఏర్పాటు చేయలేరా అని అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మధుపై కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్‌ఐ వి.రమేష్ కుమార్ తెలిపారు. "డయల్ 100 అత్యవసర సేవ. దీనిని దుర్వినియోగం చేయవద్దని. నిజమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేయమని మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాం" అన్నారాయన.
దౌల్తాబాద్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మధు ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. గురువారం పెళ్లి నిమిత్తం పక్క గ్రామమైన గోక ఫస్లాబాద్‌కు వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేస్తున్నారని డయల్ 100కు కాల్ చేశాడు. పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన నైట్ ప్యాట్రోలింగ్ బృందం గ్రామానికి చేరుకుంది. మధు క్షేమంగా ఉండడం.. ఎటువంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. ఆ సమయంలో పోలీసులు మధు వివరాలను సేకరించి తిరిగి వచ్చారు. ఆ తర్వాతి రోజు ఉదయం 22 ఏళ్ల యువకుడిని అతని తండ్రితో పాటు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.