రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు
ఈ వ్యవహారంలో అవకతవకలున్నాయంటూ రేవంత్ ఆరోపించారు. ఐఆర్ బీ ముందుగా చెల్లించాల్సిన 10 శాతం..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బేషరతుగా 48 గంటల్లో మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అంతర్జాతీయ బిడ్లు పిలిచి.. వాటిలో ఎక్కువ కోట్ చేసిన ఐఆర్ బీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కు లీజుకి ఇచ్చింది. ఈ వ్యవహారంలో అవకతవకలున్నాయంటూ రేవంత్ ఆరోపించారు. ఐఆర్ బీ ముందుగా చెల్లించాల్సిన 10 శాతం ఫీజు చెల్లించబోమని చెప్పిందని, రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ఆస్తుల్ని తెలంగాణ అమ్మేసుకుందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా , పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని హెచ్ఎండీఏ పేర్కొంది. ఓఆర్ఆర్ పై చేసిన ఆరోపణలకు బేషరతుగా మీడియా ముందు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.