Hyd: ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? హెచ్ఎండీఏ బంపరాఫర్

నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇల్లు అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది.

Update: 2022-05-11 13:44 GMT

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎలాగైనా ఓ గూడు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇల్లు కొనుక్కోవాలంటే మాత్రం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షల నుంచి కోట్లు పోయాల్సిన పరిస్థితి. అయితే సొంతిల్లు కావాలనుకునే సగటు జీవుల కోసం హెచ్‌ఎండీఏ బృహత్తర పథకంతో ముందుకొచ్చింది. సామాన్యులకు తక్కువ ధరలోనే ఇల్లు కొనుక్కునే అవకాశం కల్పించింది. అదే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకం.

రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టింది. అందుకోసం నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. బండ్లగూడలో ప్రస్తుతం 409 ఫ్లాట్లు పూర్తయ్యాయి. మరో 1082 ఫ్లాట్లలో చిన్న చిన్న పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. పనులు పూర్తయిన ఫ్లాట్లు చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్‌డ్ వాటికి రూ.2,750గా హెచ్‌ఎండీఏ ధర నిర్ణయించింది.

ఇక పోచారంలో 1382 ఫ్లాట్లు ఫినిష్‌డ్, 142 సెమీ ఫినిష్‌డ్ ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడ ధరలు కాస్త తక్కువగానే నిర్ణయించింది. ఫినిష్‌డ్ ఫ్లాట్‌ చదరపు అడుగు రూ.2,500, సెమీ ఫినిష్‌డ్ చదరుపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. మే 12 వ తేదీ గురువారం నుంచి వచ్చే నెల 14 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ పోర్టల్, మొబైల్‌ యాప్, స్వగృహ వెబ్‌సైట్‌లో కూడా ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయించనున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.

Tags:    

Similar News