Hyderabad twin blasts: జైల్లోనే చనిపోయిన సయ్యద్ మక్బూల్

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి అయిన సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబేర్

Update: 2024-07-26 05:14 GMT

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి అయిన సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబేర్ చర్లపల్లి సెంట్రల్ జైలులో చికిత్స పొందుతూ మరణించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు, 2013 దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడుతో సహా పలు కేసుల్లో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు జుబేర్.

NIA ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన నిందితుడు సయ్యద్ మక్బూల్ పాకిస్తాన్, భారతదేశంలోని ఇండియన్ ముజాహిదీన్ సభ్యులతో ప్రమేయం ఉండడమే కాకుండా పేలుళ్లకు సంబంధించిన కుట్రలో భాగమైనందుకు 2013లో అరెస్టయ్యాడు. నిందితుడు పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్, భారత్‌లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఒబైద్-ఉర్-రెహ్మాన్‌లతో సహా ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు NIA దర్యాప్తులో తేలింది. హైదరాబాదును ప్రధాన లక్ష్యంగా చేసుకుని భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో పేలుడు పదార్ధాలతో దాడులు చేసేందుకు వారు కుట్ర పన్నారు. 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మక్బూల్‌కు జీవిత ఖైదు విధించింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు పేలిన ఘటనలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 126 మంది గాయపడగా, వీరిలో 78 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 52 సంవత్సరాల మక్బూల్ చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు.. అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


Tags:    

Similar News