గుర్తుల కోసమే ఇన్ని నామినేషన్లు
మునుగోడు ఓటర్లను తికమక పెట్టేందుకు కొందరు నామినేషన్లు వేసి పార్టీలను ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 47 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా వారిలో 83 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.
పార్టీలను ఇబ్బంది పెట్టేందుకే...
ఈ నెల 17వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కొందరు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. వివిధ పార్టీల నుంచి డమ్మీలుగా కొందరు వేయడంతో వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. కొందరు గుర్తుల కోసం కూడా నామినేషన్లు వేశారు. ఓటర్లను తికమక పెట్టేందుకు కొందరు నామినేషన్లు వేసి పార్టీలను ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ కు కారు గుర్తు పోలి ఉన్న కొన్ని గుర్తులు ఇబ్బందిగా మారాయి. అయితే దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ తమ కారు గుర్తు పోలి ఉన్న వాటిని ఎన్నికల్లో కేటాయించవద్దంటూ ఎన్నికల కమిషన్ ను కోరింది.