పక్కా స్కెచ్... స్టడీ చేసి మరీ రైడ్
మల్లారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించే ముందు ఐటీ అధికారులు కొంత అధ్యయనం చేసినట్లు తెలిసింది
మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కుటుంబసభ్యుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. మల్లారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించే ముందు ఐటీ అధికారులు కొంత అధ్యయనం చేసినట్లు తెలిసింది. ముందుగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తో మల్లారెడ్డితో ఐటీ అధికారులు మంతనాలు జరిపారు. నలభై ఎకరాల భూమిని కొనుగోలు చేసే విషయంపై మల్లారెడ్డితో బేరసారాలకు దిగారు. తక్కువ ధరకైనా ఇస్తామని, నగదును బ్లాక్ లో ఇచ్చినా పరవాలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మల్లారెడ్డి మాత్రం తనకు భూములు కొనుగోలు చేసే ఆలోచన లేదని, విద్యాసంస్థలను విస్తరించాలని చూస్తున్నామని మల్లారెడ్డి తెలిపారు.
ఆరు నెలలుగా...
ఆరు నెలలుగా మల్లారెడ్డి బ్యాంకు అకౌంట్లపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆయనకు, ఆయన కంపెనీలకు చెందిన మూడు వందల కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను నిశితంగా పరిశీలించిన తర్వాతనే సోదాలకు అకస్మాత్తుగా దిగినట్లు చెబుతున్నారు. నిన్న అర్థరాత్రి వరకూ మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై సోదాలు జరిపిన ఐటీ అధికారులు మొత్తం మూడు షిఫ్ట్ లలో సోదాలు నిర్వహించారు. 200 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. నాలుగు కోట్ల నగదును సీజ్ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రతతో ఈరోజు తెల్లవారు జాము నుంచే తిరిగి దాడులు జరుగుతున్నాయి.