తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ అలోక్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో..
తెలంగాణ హై కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడడి, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావు, డీజీపీ అంజనీ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధేను నియమించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైకోర్టుకు జస్టిస్ అలోక్ అరాధే ఆరవ సీజేగా వచ్చారు. అరాధే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
1964, ఏప్రిల్ 13న ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జన్మించిన జస్టిస్ అలోక్.. 1988, జులై 12న న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016 సెప్టెంబర్ 16న జమ్ముకశ్మీర్ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2018లో మూడు నెల పాటు జమ్ముకశ్మీర్ తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. అదే ఏడాది నవంబర్ 17 నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తించారు. కొంతకాలం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా పనిచేశారు.