కాకతీయ విశ్వవిద్యాలయంలో అసలు ఏమి జరుగుతోంది!!
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్నో సమస్యలు బయటపడుతున్నా
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్నో సమస్యలు బయటపడుతున్నా అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. చిన్న చిన్న సమస్యలతో మొదలుపెడితే విద్యార్థుల ప్రాణాలు తీసే ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో భయభ్రాంతులకు విద్యార్థులు గురయ్యారు. పోతన గర్ల్స్ హాస్టల్‌లో రాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అయితే ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.15 రోజుల క్రితం హాస్టల్ గదిలో ఉన్న ఓ అమ్మాయిపై ఫ్యాన్ ఊడిపడి తలకు బలమైన గాయమైంది. ఆ ఘటన మరువక ముందే మరోసారి స్లాబ్ పెచ్చులూడటంపై అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాన్ని మార్చాలని ఎంతగా డిమాండ్ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్టల్ రూమ్ నం.19లో ఉంటూ పొలిటికల్‌సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్దిరోజుల కిందట రాత్రి భోజనం చేసిన తరువాత తన గదికి వచ్చిన ఆమె మంచంపై ఉన్న వస్తువులు సర్దుకుంటుండగా, సీలింగ్ ఫ్యాను ఒక్కసారిగా ఊడి పైన పడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.