Kalva kuntla Kavtiha : కవితక్కా... ఆ అలక దేనికి? కారణం చెప్పవూ?

కల్వకుంట్ల కవిత ఈసారి బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది

Update: 2024-10-10 12:09 GMT

 Kalva kuntla Kavtiha

కల్వకుంట్ల కవిత అనగానే ముందు గుర్తుకొచ్చేది బతుకమ్మ పండగ. తెలంగాణ ఉద్యమంలోనూ జాగృతి పేరిట సంస్థ ను స్థాపించి బతుకమ్మ పండగతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఒకరకంగా మహిళలను చైతన్య వంతుల్ని చేసేందుకు కవిత దోహదపడ్డారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వాడవాడలా విస్తరిస్తూ ఉద్యమాన్ని పీక్ కు తీసుకు పోవడంలో కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండగ ను దేశ విదేశాల్లో తీసుకెళ్లి దానికి గుర్తింపు తెచ్చారు. వివిధ దేశాల్లో కూడా బతుకమ్మ పండగను నిర్వహించి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. మొత్తం పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బతుకమ్మ ఉత్సవాలను జరిపారు.

పదిహేనేళ్ల పాటు...
కల్వకుంట్ల కవిత దాదాపు పదిహేనేళ్ల పాటు బతుకమ్మ ఉత్సవాలను జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఉదమం సమయం నుంచి తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల పాటు ఆమె బతుకమ్మ ఉత్సవాలను ఒక దశకు తీసుకెళ్లారు. గతంలో బతుకమ్మ వేడుకలు జరిగినప్పటికీ కవిత ప్రమేయంతో దానికి విశేష ప్రాచుర్యం లభించింది. మహిళల వద్దకు వెళ్లి బతుకమ్మను పేర్చడం దగ్గర నుంచి ఆడటం వరకూ ఆమె అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దానికి ఒక శోభను తెచ్చారు. అందుకే బతుకమ్మ అనగానే కవితక్క గుర్తుకు వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో బతుకమ్మ పండగను అధికారిక పండగా గుర్తింపు తెచ్చారు. నిధులను కేటాయింప చేశారు.
ఈసారి వేడుకలకు...
అలాంటి కల్వకుంట్ల కవిత ఈసారి బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఐదు నెలల పాటు తీహార్ జైలులో ఉండటం, బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో కవిత ఈసారి బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉన్నారు. బెయిల్ పై విడుదలయిన కవిత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈసారి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి సంస్థ కూడా బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కవిత బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఆమె మాత్రం ఇప్పటి వరకూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఈసారి ఆమె దూరంగానే ఉంటారని అర్థమవుతుంది. ఈరోజు సద్దుల బతుకమ్మ. వేడుకలకు చివరి రోజు. మరి ఆమె బతుకమ్మ ఆడతారో లేదో చూడాలి.
Tags:    

Similar News