నేడు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేడు జరగనుంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేడు జరగనుంది. స్థానికసంస్థల ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కసిరెడ్డి నారాయణ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను రెండు పార్టీలూ గోవా తీసుకుని వెళ్లి కొన్ని రోజులుగా క్యాంప్‌లను నిర్వహిస్తున్నాయి.
పటిష‌్టమైన బందోబస్తు...
మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం పది పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లను నేరుగా గోవా నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు.