గల్ఫ్ మృతుల కుటుంబాలకు గుడ్ న్యూస్.. మార్గదర్శకాల విడుదల

గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా చారిత్రాత్మకమని మంద భీంరెడ్డి తెలిపారు. మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2024-10-08 12:39 GMT

Telangana gulf families

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చారిత్రాత్మకమని టీపీసీసీ ఎన్నారై సెల్ నేత మంద భీంరెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్నారై సెల్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మార్గదర్శకాల జీవో విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు దేశ చరిత్రలోనే ప్రథమమన్న భీంరెడ్డి అక్రమ నివాసులు లను కూడా దయతో ఉదారంగా చేర్చాలని కోరారు. 'గల్ఫ్' తో సహా 18 ఈసీఆర్ దేశాలకు, సింగపూర్ తదితర దేశాలకు వర్తింపజేయాలని ద భీంరెడ్డి కోరారు. సుదూర తీరంలో గల్ఫ్ దేశాలలో మన తెలంగాణ కార్మికులు మరణించిన సందర్భంలో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం ఈ నెల16వ తేదీన డు నాలుగు అంశాలతో జీవో నెంబర్ 205 ను విడుదల చేసిన విషయం తెలిసిందే.గల్ఫ్ దేశాలలో చనిపోయిన తెలంగాణ ప్రవాసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు అంశం ఇందులో ఒకటని తెలిపారు. జీవో నెంబర్ 205 కు కొనసాగింపుగా ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కొరకు మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 216 ను ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు.

అర్హత ప్రమాణాలు:
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించినవారికి ఈ పరిహారం వర్తించనుంది.
2023 డిసెంబర్ 7 న లేదా తర్వాత చనిపోయిన కార్మికులకు
తెలంగాణ వాసులకు మాత్రమే
మరణానికి కారణం ఏదైనా వర్తింపు
మరణించిన గల్ఫ్ ఉద్యోగి జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రయోజనాన్ని అందచేస్తారు.
మరణించిన గల్ఫ్ ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)
మరణించిన గల్ఫ్ కార్మికుని రద్దు చేయబడిన పాస్ పోర్ట్
మరణించిన సమయంలో గల్ఫ్, ఇరాక్ దేశాలలో ఉద్యోగానికి సంబంధించిన రుజువు
మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబ సభ్యుడు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తును సమర్పించాలి
అర్హులైన దరఖాస్తుదారుల చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతా వివరాలు
ధృవీకరించిన తర్వాత, జిల్లా కలెక్టర్ అర్హతగల కుటుంబ సభ్యునికి చెల్లింపు కోసం ప్రొసీడింగ్స్ చేస్తారు.
మంజూరైన రూ.5 లక్షలు అర్హత కలిగిన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేస్తారు.
మృతి చెందిన తేదీ లేదా మృతదేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి ఆరు నెలల లోపు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి
జిల్లా కలెక్టర్లకు మంజూరి అధికారం ఉంటుంది. అనవసరమైన జాప్యాన్ని నివారించి వీలైనంత త్వరగా ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేస్తారు
తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగం అకౌంట్ ద్వారా చెల్లింపులు చేస్తారు.
'గల్ఫ్' తో సహా 18 ఈసీఆర్ దేశాలకు వర్తింపజేయాలి.

విదేశాలకు వెళ్లే మన కార్మికుల భద్రత అంశం, అనుకూలంగా లేని కార్మిక చట్టాలను దృష్టిలో పెట్టుకొని 41 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఎమిగ్రేషన్ యాక్టు ను1983 ను రూపొందించింది. 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించారు. ఈసీఆర్ అంటే... ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్ (విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి అవసరమైన) అని అర్థం.
తెలంగాణ ప్రభుత్వం తన సంక్షేమ చర్యల్లో భాగంగా విడుదల చేసిన జీవో ను ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించిన వారికి వర్తింపజేశారు. ప్రవాసీ కార్మికులపై సీఎం రేవంత్ మరింత దయతో ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
ఇవీ 18 ఈసీఆర్ దేశాలు :
1. బహ్రెయిన్, 2. కువైట్, 3. ఓమాన్, 4. ఖతార్, 5. సౌదీ అరేబియా, 6. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 7. ఇరాక్, 8. ఆఫ్ఘనిస్తాన్, 9. జోర్డాన్, 10. లెబనాన్, 11. లిబియా, 12. మలేసియా, 13. సుడాన్, 14. సౌత్ సుడాన్, 15. సిరియా, 16. యెమెన్, 17. ఇండోనేసియా, 18. థాయిలాండ్. వీటితో పాటు సింగపూర్, ఇజ్రాయిల్, కాంబోడియా, రష్యా, ఉక్రేన్, మాల్దీవ్స్ తదితర దేశాలలో ఉన్న వారికి కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
నిబంధనల్లో మార్పులు చేయాలి
మరణించిన సమయంలో గల్ఫ్, ఇరాక్ దేశాలలో ఉద్యోగానికి సంబంధించిన రుజువు (ఉదా. వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం) ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలి అనే నిబంధనతో చాలా మంది ఆందోళనతో ఉన్నారు. యజమానుల హింసలు భరించలేక పారిపోయిన వారు, కొందరు ఏజెంట్లు పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని విజిట్ వీసాపై విదేశాలకు తీసికెళ్ళి వదిలేసిన సందర్భంలో 'ఖల్లివెల్లి' (అక్రమ నివాసులు) గా మారిన వారికి ఈ పథకం వర్తించకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని చర్చ నడుస్తోంది.ప్రవాసీ కార్మికులపై సీఎం రేవంత్ మరింత దయతో ఉదారంగా వ్యవహరించాలని నిబంధనలు సడలించి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. త్వరలో నియమించే సలహా కమిటీ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ప్రవాసుల కుటుంబాలు ఆశాభావంతో ఉన్నాయి. సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావ్ లు పొన్నం ప్రభాకర్ ను కలిశారు.


Tags:    

Similar News