నేడు ప్రీతి అంత్యక్రియలు.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్
మృత్యుంజయురాలిగా తిరిగి వస్తుందనుకున్న కన్నకూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న నిజాన్ని భరించలేక..
ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడింది వైద్యవిద్యార్థిని ప్రీతి. ఆమె మరణం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. మృత్యుంజయురాలిగా తిరిగి వస్తుందనుకున్న కన్నకూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న నిజాన్ని భరించలేక.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూసిన ప్రీతి మృతదేహానికి సోమవారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున 4.15 గంటలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంబులెన్స్ లో వరంగల్ లోని స్వగ్రామమైన మొండ్రాయి గిర్ని తండాకు ప్రీతి మృతదేహాన్ని తరలించారు.
ప్రీతి మృతితో గిర్నితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొద్దిసేపటిలో ప్రీతి అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో మొండ్రాయి గిర్నిలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి నిరసనగా ఓయూ జేఏసీ నిరసనలు చేస్తున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రీతిని వేధించి, ఆమె మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేంతవరకూ ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాలు తెలిపాయి.