పీజీ డాక్టర్ ప్రీతి చనిపోయిందా ? గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకెళ్లినట్టు ?
బాధితురాలి చెల్లెలు గవర్నర్ పర్యటన సందర్భంగా పూల మాల తీసుకురావడంలో గవర్నర్ ఉద్దేశ్యం ఏమిటని..
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి మూడ్రోజుల క్రితం హై డోస్ లో మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు వైద్యులు విడుదల చేసిన బులెటిన్ లో ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. స్వతహాగా శ్వాస తీసుకునే అవకాశం లేకపోవడంతో ఎక్మో పెట్టినట్లు తెలిపారు. అలాగే చికిత్సకు ఆమె గుండె స్పందిస్తుందని బులెటిన్ లో తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై, గవర్నర్ తమిళిసై ఆస్పత్రికి రావడంపై ప్రీతి చెల్లెలు అసహనం వ్యక్తం చేసింది.
నిన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని చూసేందుకు వెళ్లారు. అయితే.. బాధితురాలి చెల్లెలు గవర్నర్ పర్యటన సందర్భంగా పూల మాల తీసుకురావడంలో గవర్నర్ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నలు లేవనెత్తింది. తన అక్క చనిపోయిందని పూలదండలు తెచ్చారా ? అని ప్రశ్నించింది. ఈ ఘటన తనతో పాటు తన కుటుంబాన్ని గందరగోళానికి గురిచేసిందని వాపోయింది. డాక్టర్లు కూడా ప్రీతి వైద్యానికి స్పందిస్తుందని తప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నారని తెలిపింది.
తన సోదరిని సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఒక కాలేజీ స్టూడెంట్ బాత్రూమ్ కి వెళ్లడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి ? కాలేజీ యాజమాన్యం తప్పుడు ప్రకటనలు చేసి తప్పుడు ఆరోపణలు సృష్టిస్తోందని, తన అక్క తనకు, తమ కుటుంబానికి స్ఫూర్తిదాయకమని తెలిపింది. తమకు ఎవరి పరామర్శలు, సానుభూతి అక్కర్లేదని తెలిపింది. ప్రభుత్వానికి చేతనైతే ఈ ఘటనపై ఒక కమిటీ వేసి, తన అక్కకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమెవరో తెలుసుకుని శిక్షించాలని డిమాండ్ చేసింది. బాధితురాలి సోదరి కళాశాల యాజమాన్యం, హెచ్‌ఓడి, ప్రిన్సిపాల్ సహా.. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇతరులపై విచారణకు ప్రత్యేక కమిటీని కోరింది.
రాజ్ భవన్ వివరణ
కాగా.. ఈ ఆరోపణలపై రాజ్ భవన్ స్పందించింది. గవర్నర్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆమె కారుపై పూలదండ ఉందని, అది ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించేందుకు ఉద్దేశించిన దండ అని స్పష్టం చేశాయి. ఇలా తప్పుగా అర్థం చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆమె ఆలయంలో ప్రార్థించారని తెలిపాయి.