#AskKTR - ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధానిపై సెటైర్లు !
భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.100 దాటగా.. వంటగ్యాస్ ధర రూ.1000 దాటిపోవడం పై మంత్రి కేటీఆర్ అభిప్రాయం..
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లతో #AskKTR నిర్వహించారు. #AskKTR హ్యాష్ టాగ్ తో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు కేటీఆర్ జవాబిచ్చారు. వాటిలో తెలంగాణ ఎన్నికల గురించి ఒక నెటిజన్ ప్రశ్నించగా.. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయం అని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తమకు పోటీనే అన్న కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటోందని ఆరోపించారు.
టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఓ ప్రశ్న అడిగారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని మధుర శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా హైదరాబాద్ ను భారతీయ చిత్ర రంగానికి కేంద్రబిందువుగా మార్చవచ్చని సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని బదులిచ్చారు. కొవిడ్ సంక్షోభం వల్ల తమ ప్రణాళికలు ఆలస్యం అయ్యాయని వివరణ ఇచ్చారు.
కాగా.. కాంగ్రెస్ నేత కొండా సురేఖ కేటీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు ? యాదాద్రి నిర్మాణంలో లోపం తప్పిందం ఎవరిది? ఇలా చాలా ప్రశ్నలు అడగ్గా.. కేటీఆర్ ఏ ఒక్క ప్రశ్నకూ బదులివ్వకపోవడం గమనార్హం.