ఫాంహౌస్ అక్రమ నిర్మాణమయితే కూల్చేయండి
తనకు ఫాం హౌస్ అక్రమంగా నిర్మించి ఉంటే దానిని కూల్చివేయవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు
తనకు ఫాం హౌస్ అక్రమంగా నిర్మించి ఉంటే దానిని కూల్చివేయవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైడ్రాను తమ ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో తెచ్చిందన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు అనుమతించేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందన్న ఆయన తనకు హిమాయత్ నగర్ ప్రాంతంలో ఫాం హౌజ్ ఉందని, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని కేటీఆర్ ఆరోపించారని, అయితే తాను సవాల్ విసురుతున్నానని, తన ఇల్లు అక్రమంగా నిర్మించి ఉంటే దానిని కూలగొట్టవచ్చని తెలిపారు.
మీరే వచ్చి చూసుకోండి...
ఈ మేరకు తానే స్వయంగా హైడ్రా కమిషనర్ ను కోరుతున్నానని తెలిపారు. అధికారులకు బదులు బీఆర్ఎస్ నేతలు వెళ్లి అక్కడ కొలతలు వేసి చూడాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. తాము అధికారంలోకి వచ్చిన ఐదురోజుల్లోనే వంద గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో తాము ప్రచారానికి వేల కోట్లు తగలేయడం లేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అప్పు ఏడు లక్షల కోట్లు ఉందని ఆయన తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.