చిరంజీవి ఇంటికి వెళ్లిన ఏపీ మంత్రి రోజా
కుటుంబ సమేతంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా..
హైదరాబాద్ : ఏపీ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి రోజా హైదరాబాదుకు వెళ్లారు. ఆమె కుటుంబ సమేతంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు.
ఇక ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేదని అన్నారు. ఏపీ పరిస్థితుల గురించి ఎవరో చెప్పారని కేటీఆర్ అంటున్నారని, ఆ చెప్పిందెవరో గానీ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా, స్ఫూర్తిదాయకమైన నేతగా కేటీఆర్ ను అందరం గుర్తిస్తాం. అటువంటి కేటీఆర్ మా ఆంధ్రప్రదేశ్ గురించి అలా మాట్లాడతారని నేను అనుకోను. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదు. పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారు. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు.
టూరిజం మినిస్టర్ గా నేను కేటీఆర్ ను ఏపీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకునే సీఎం జగన్ పాలనలో ఏపీ ఎలా ఉందో చూడండని అన్నారు. కేటీఆర్ ఏపీకి ఎప్పుడు వస్తారో డేట్, టైమ్ చెబితే వెయిట్ చేస్తాను. ఆయనకు స్వాగతం పలికి, టూరిజం మినిస్టర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి చూపిస్తాను. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్ సాగిస్తున్న పాలనను చూపిస్తానని రోజా స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, అది అందరికీ తెలిసిన విషయమేనని రోజా అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి కేటీఆర్ వచ్చి చూస్తే అర్థమవుతుందని అన్నారు.