Big Breaking : కవితకు దక్కని ఊరట.. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు.

Update: 2024-03-26 07:32 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కస్టడీని పొడిగించాలంటూ ఈడీ పిటీషన్ వేసింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను ఈడీ అధికారులు కోరారు. మరో వైపు కవిత బెయిల్ పిటీషన్ పై కూడా వాదనలు ముగిశాయి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏప్రిల్ 16వ వరకూ కవిత కుమారులకు పరీక్షలున్నాయని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తిరిగి ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ ఇస్తామని తెలిపారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకూ రిమాండ్ విధించింది.  దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని ఈడీ బలంగా వాదిస్తుంది. కవిత తన వద్ద ఉన్న ఆధారాలు తమకు లభించకుండా సెల్‌ఫోన్లను కూడా ధ్వంసం చేశారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం వంద కోట్ల స్కామ్ కాదని, ఈ కుంభకోణం ఆరు వందల కోట్ల మేరకు జరిగిందన్నది ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈడీ వాదన ఇదీ...
సౌత్ కు సంబంధించిన లిక్కర్ వ్యాపారులతో కవిత సంప్రదింపులు జరిపి వారి నుంచి నిధులు సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పగించారని, హోటల్ లో వీరు తరచూ సమావేశమై లిక్కర్ పాలసీని మార్చడంపై చర్చించారని కూడా చెబుతున్నారు. లిక్కర్ పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, మద్యం వాపారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని విదేశాలకు తరలించారని కూడా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశామని, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని అంటున్నారు.
కవిత అభ్యంతరాలు ఇవే...
మరోవైపు కవిత మాత్రం ఈ స్కామ్ తో తనకు ఏమాత్రం సంబంధం లేదని చెబుతున్నారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చేమో కాని, ఇది తప్పుడు కేసు అని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండిరంగ్ కేసు అని చెప్పారు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు మాత్రమేనని అంటూ ఆమె పదే పదే అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, ఎన్నికల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగిందని కవిత వాదిస్తున్నారు. తనకు ఏ పాపమూ తెలియదని ఆమె అంటున్నారు.
ఏ పాపమూ తెలియదు...
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత తెలిపారు. తాను అప్రూవర్ గా మారబోను అని చెప్పారు. కవితను ఈ నెల 15వ తేదీన బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఇప్పటి వరకూ కవిత పదిరోజుల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇందులో నిందితుడికి బీజేపీ టిక్కెట్ కూడా ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, ఇంకో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో యాభై కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ఆమె న్యాయస్థానంలో నినాదాలు చేశారు. కవిత బెయిల్ పిటీషన్ పై ఏప్రిల్ ఒకటోతేదీన న్యాయస్థానం విచారించనుంది. 
Tags:    

Similar News