కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. వారికి భరోసా కల్పించాలంటూ..
పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ ను అమలు చేయడంతో పాటు వారి సర్వీస్ ను కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల..
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బండి సంజయ్ ప్రస్తావించారు. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ ను అమలు చేయడంతో పాటు వారి సర్వీస్ ను కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని అన్న ఆయన.. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ పనులతో పాటు.. దోమల నివారణ చర్యలు కూడా తీసుకునే కార్యదర్శుల సేవలు మరువలేనివన్నారు.
గ్రామల అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతున్న పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వారిని నిత్యం వేధించడం తగదని పేర్కొన్నారు బండి సంజయ్. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపడంతో పాటు, వారికి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.