మత్తు ఇవ్వకుండా.. 2 గంటలపాటు సినిమా చూపిస్తూ సర్జరీ

శస్త్రచికిత్స సమయంలో వైద్యులు మహిళతో మాట్లాడుతూ.. తన అభిమాన నటుల వివరాలు తెలుసుకున్నారు.

Update: 2022-08-26 06:08 GMT

శస్త్ర చికిత్స చేసేముందు వైద్యులు.. పేషంట్ కు మత్తుమందు ఇస్తారు. పేషెంట్ మత్తులోకి వెళ్లాక ఆపరేషన్ మొదలు పెడతారు. కానీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు వెరైటీగా ఓ మహిళకు సినిమా చూపిస్తూ రెండు గంటలపాటు సర్జరీ నిర్వహించారు. గురువారం గాంధీ ఆస్పత్రి న్యూరో సర్జన్లు 50 ఏళ్ల ఓ మహిళ మెదడులోని కతులను తొలగించారు. హైదరాబాద్ కు చెందిన మహిళ ఇటీవల గాంధీ వైద్యులను సంప్రదించింది. మహిళకు పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె మెదడులో కణుతులున్నట్లు గుర్తించారు. ఆ కణుతులను శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

ఈ మేరకు గురువారం ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అనస్తీషియా ఇవ్వకుండా.. పూర్తి స్పృహలో ఉండగానే.. మహిళకు ఇష్టమైన సినిమా చూపిస్తూ శస్త్ర చికిత్స చేసి మెదడులోని కణుతులను తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు వివరించారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు మహిళతో మాట్లాడుతూ.. తన అభిమాన నటుల వివరాలు తెలుసుకున్నారు. తమవద్దనున్న స్మార్ట్ ఫోన్లో సినిమా చూపించగా.. ఆమె ఆ సినిమాలో లీనమైంది.
మధ్యమధ్యలో వైద్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ సినిమా చూడగా.. వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ పూర్తయ్యాక మహిళ వైద్యులకు నమస్కారం చేసి.. ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్జరీలో న్యూరో సర్జరీ వైద్యులు ప్రకాశ్ రావు, ప్రతాప్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా.. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు చేసిన సందర్భాలున్నాయి కానీ.. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తివ్వకుండా ఇలాంటి సుదీర్ఘ సర్జరీ చేయడం ఇదే తొలిసారి.


Tags:    

Similar News