అవయవదానంతో చిరంజీవుడైన కానిస్టేబుల్
మే 6వ తేదీన నాగార్జునసాగర్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం
మలక్ పేట : నల్గొండకు చెందిన కానిస్టేబుల్ బత్తుల విజయ్ కుమార్ (32) బ్రెయిన్ డెడ్ అయినట్లు న్యూరో ఫిజిషియన్లు తెలుపగా.. అతని అవయవాలను దానం చేసేందుకు భార్య, తల్లిదండ్రులు ముందుకొచ్చారు. బ్రెయిన్ డెడ్ కానిస్టేబుల్ నుంచి సేకరించిన గుండెను బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య గ్రీన్ ఛానెల్ ద్వారా మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు తరలించారు.
మే 6వ తేదీన నాగార్జునసాగర్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మలక్ పేటలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐదురోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన విజయ్ కుమార్ ను.. మంగళవారం న్యూరో ఫిజిషియన్లు పరీక్షించారు. వైద్య పరీక్షల్లో అతను బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు తెలియడంతో.. జీవన్ దాన్ ద్వారా కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. కుటుంబీకుల అంగీకారంతో.. విజయ్ కుమార్ మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించి, గుండెను అపోలో ఆస్పత్రికి పంపించారు. బ్రెయిన్ డెడ్ అయిన విజయ్ కుమార్ అవయవదానంతో చిరంజీవుడయ్యాడు. విజయ్ కుమార్ నుంచి సేకరించిన మిగిలిన అవయవాలను అవసరమైన పేషంట్లకు అమర్చనున్నట్లు యశోద వైద్యులు వెల్లడించారు.