నేడు మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు రాజ్‌భవన్‌లో మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలుకాగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. మహేందర్‌రెడ్డి తాండూర్ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2019, 2022లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక.. తొలి క్యాబినెట్ లో పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా 2 జూన్ 2014న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి ప్రమాణస్వీకారం చేసి 8 జూన్ 2014న బాధ్యతలను చేపట్టారు. అనంతరం 2018 వరకు మంత్రి గా ఆయన కొనసాగారు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. ఇలా మహేందర్ రెడ్డి రెండో సారి ఆగస్టు 24 న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.