బోయిగూడ అగ్నిప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి
బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సికింద్రాబాద్ : బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఎప్పటిలా తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రకటనలు చేసిన జనసేన పార్టీ.. ఇప్పుడు హిందీలోనూ ప్రకటన విడుదల చేయడం ఆసక్తి రేపింది. అయితే అగ్నిప్రమాద ఘటనపై తెలుగులో ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
అగ్నిప్రమాద ఘటనలో 11 మంది సజీవదహనం అవ్వగా.. మృతులంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే. మృతుల కుటుంబాలకు తన సానుభూతి అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఈ ప్రకటనను ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ విడుదల చేశారని తెలుస్తోంది. కాగా.. ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా.. ప్రధాని మోదీ రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.