హసన్ పల్లి ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి
కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, మరో 14మంది గాయపడడం..
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించారు. హసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందడం ఎంతో కలచివేసిందని ఓ ప్రకటనలో తెలిపారు.
"కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, మరో 14మంది గాయపడడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదానికి గురయినవారు పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసి తీవ్ర ఆవేదన కలిగింది. కుటుంబ సభ్యుడు మరణించగా దశదిన కర్మలో భాగంగా అంగడిదింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణంలోని సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం మాటలకు అందని విషాదంగా ఉంది. ప్రమాదానికి గురైన కుటుంబం వారు ప్రయాణించిన వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడపడమే కారణమని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోంది. గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను, గాయపడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రమాదంలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను." అని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.