మోదీతో మీటింగ్ మామూలుగా లేదు
తెలంగాణలో పార్టీ విజయానికి మంచి అవకాశాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు.;
తెలంగాణలో పార్టీ విజయానికి మంచి అవకాశాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని జరిపిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నిరంతరం ప్రజలతో మమేకం అవ్వాలని మోదీ కార్పొరేటర్లకు సూచించారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మరింత విశ్వాసాన్ని కలిగించేలా పనితీరును మెరుగుపర్చుకోవాలని మోదీ అన్నారు. బీజేపీలో పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన వారు అనేక మంది బీజేపీలో ఉన్న విషయాన్ని మోదీ ఈ సందర్భంలో గుర్తు చేశారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతను....
ప్రస్తుత ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని సొమ్ము చేసుకునే దిశగా పనిచేయాలని కార్పొరేటర్లకు ఉద్భోదించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు ఉండాలని కూడా మోదీ అన్నారు. ప్రతికూల విషయాలను పక్కనపెట్టి సానుకూల థృక్ఫథంతో పనిచేయాలని కోరారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్పొరేటర్లకు మోదీ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే విజయం సులువని వివరించారు. మోదీతో జరిగిన సమావేశంలో మొత్ం 46 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. మోదీతో సమావేశం అనంతరం కార్పొరేటర్లు సంతోషం వ్యక్తం చేశారు. మోదీతో సమావేశం ముగిసిన తర్వాత కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి అవకాశం తమకు లభిస్తుందని అనుకోలేదన్నారు. ఈ సందర్భంగా మోదీని కార్పొరేటర్లు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా సందర్శిస్తానని వారికి నవ్వుతూ సమాధానమిచ్చారు.