రాఖీ పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు మహిళలు తమతమ అన్నదమ్ములకు రాఖిలు కట్టేందుకు సొంతూళ్లకు బయలుదేరుతుంటారు. ..

Update: 2023-08-29 05:06 GMT

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు మహిళలు తమతమ అన్నదమ్ములకు రాఖిలు కట్టేందుకు సొంతూళ్లకు బయలుదేరుతుంటారు. రాఖీ పండగ రోజు ఎక్కడ చూసినా బస్‌ స్టేషన్లు, బస్సులు మహిళలకు కిటకిటలాడుతుంటాయి. ప్రతి బస్సులలోనూ రద్దీ అధికంగానే ఉంటుంది. రాఖీ పండగకు ముందు రోజు నుంచి పండగ మరుసటి రోజు వరకు మహిళల రద్దీ అధికంగా ఉంటుందనే చెప్పాలి.ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నాలుగు రోజుల పాటు ఈ టికెట్‌ అందుబాటులో ఉండదని వెల్లడించారు. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండగ నేపథ్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటుగా టీ-9 టికెట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే సెప్టెంబర్ 2 నుంచి మళ్లీ ఈ టికెట్లను అమలులో ఉంటాయని తెలిపారు. అప్పటినుంచి యథాతథంగా ఈ టికెట్లు కొనసాగుతాయని ఆర్టీసీ తెలిపింది.

టీ-9 టికెట్లతో ఉపయోగాలు ఏమిటి?

ఇదిలా ఉంటే.. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆర్టీసీకి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించేందుకు టీ-9-60ని, 30 కిలోమీటర్లకు టీ-9-30 టికెట్లను ఇటీవల నుంచి అమలు చేస్తోంది. టీ-9-60 టికెట్‌ను 100 రూపాయలకు అలాగే టీ-9-30 టికెట్‌కు 50 రూపాయలు ప్రయాణికుల నుంచి సంస్థ వసూలు చేస్తోంది. అయితే రాఖీ పండగ సందర్భంగా ఈ టికెట్లు నిలిపివేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. పండగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉండటంతో టీ-9 టికెట్లు మంజూరు చేయడం సిబ్బందికి చాలా కష్టతరమవుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ టికెట్లు ఇవ్వాలంటే ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివాలన్నింటిని టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో సమయం ఎక్కువగా తీసుకోవడం వల్ల రద్దీ సమయంలో ఈ టికెట్స్‌ జారీ చేయడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

Tags:    

Similar News