Telangana : రెడీ అవ్వండి... వెరిఫికేషన్ నేటి నుంచే.. నాలుగు పథకాలకు ముహూర్తం
తెలంగాణలో నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాలకు నేడు బీజం పడనుంది. నేటి నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనుంది.;
తెలంగాణలో నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాలకు నేడు బీజం పడనుంది. నేటి నుంచి నాలుగు పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనుంది. జనవరి 16వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి స్కీమ్ లకు సంబంధించిన సర్వే కొనసాగుతుంది. ఈ నెల 20వ తేదీ వరకూ సర్వే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక యాప్ లో సర్వే చేసిన వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు స్కీమ్ లకు సంబంధించి నేటి నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే లో వచ్చిన రిజల్ట్ మేరకే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్రామ సభల ద్వారా...
ఈ నెల 20వ తేదీ వరకూ అంటే ఐదు రోజల పాటు సర్వే నిర్వహించిన అనంతరం ఈ మూడు పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ముసాయిదా జాబితాను రెడీ చేయనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు కూడా ఆహ్వానించనున్నారు. అనంతరమే ఈ పథకాలకు సంబంధించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. సర్వేలో ఏదైనా లోటు పాట్లు ఉంటే వాటికి సరి చేసుకోవడానికి కూడా కొంత సమయం ఇచ్చేలా, వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రైతు భరోసా నిధులను...
ఈ నెల 26వ తేదీ నుంచి రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలుచొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విధివిధానాలను సిద్ధం చేసింది. సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను ఇస్తామని పేర్కొంది. ఇక వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇవ్వనున్నారు. వీరి ఎంపిక కూడా ఈ సర్వేలో వెల్లడి కానుంది. ఇక మరో ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం కింద ఒక్కొక్క లబ్దిదారుడికి ఐదు లక్షల రూపాయలను ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చెల్లించనుంది. అయితే తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
రేషన్ కార్డుల జారీపై...
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక యాప్ ను కూడా విడుదల చేశారు. వెబ్ సైట్ ద్వారా లబ్దిదారులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వీరి పేర్లను పరిశీలించిన అనంతరం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీంతో ఈ నెల 24వ తేదీకి ఈ పథకానికి సంబంధించిన లబ్దిదారుల జాబితా కూడా తయారవుతుందని, తర్వాత వెంటనే నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు మరో కీలకమైన సమస్య. రేషన్ కార్డులు. వీటిని అందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయితే త్వరలోనే అర్హులైన వారికి తెలుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒకింత ఉత్కంఠ నెలకొంది.