రాజకీయాలతో వారికి ఏం సంబంధం.? పేర్లు 'రెడ్ బుక్'లో రాస్తాం : రేవంత్ హెచ్చరిక
అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తామని హెచ్చరించారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టమని హెచ్చరించారు. తాను అనేది ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనేనని.. ప్రజల కోసం పనిచేసే అధికారులపై నాకెప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామన్నారు.
అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధం? అని ప్రశ్నించారు. పది సంవత్సరాల్లో చేయనిది.. రెండు నెలల్లో ఎలా చేస్తారు? అని అడిగారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారని అన్నారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలేని ఆరోపించారు. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారని ఆరోపించారు.