కొత్త సీఎం: రాహుల్ నిర్ణయం చెప్పేశారా?
తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థికి సంబంధించి ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థికి సంబంధించి ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గత 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు అధికారులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే సాయంత్రం లోపు ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా అనే విషయమై కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.