Telangana : తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు... ఈ నిధులు ఎవరడిగారు బాబాయ్?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరద నిధుల సాయం విడుదలలో వివక్ష కనపర్చింది;
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరద నిధుల సాయం విడుదలలో వివక్ష కనపర్చింది. తీవ్ర వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు నిధుల విడుదలలో కేంద్ర హోం శాఖ మరోసారి అన్యాయం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే తాము అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఒకలా, విపక్ష పార్టీలు పవర్ లో ఉన్న రాష్ట్రాలకు మరొకలా నిధులు సాయం చేయడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు మొత్తం 13 జిల్లాల్లో వరదలు సంభవించాయి. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వ సాయం కింద 5,855 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రకటన చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలు...
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు బాగా వరదలకు దెబ్బతిన్నాయి. అలాగే తెలంగాణలోనూ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని వరదలు రావడంతో వాటి నుంచి వరద బాధితులను కాపాడుకోవడాానికి తలకు మించి ప్రభుత్వాలకు భారంగా మారింది. విజయవాడలో ఎలాగయితే ఇళ్లలోకి నీరు చేరి సర్వస్వం కోల్పోయారో, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోనూ అదే మాదిరి ఎందరో సామాన్యుల జీవితాలు రోడ్డున పడ్డాయి.
అరకొర సాయం...
విజయవాడ బుడమేరు ముంచెత్తడంతో సింగ్ నగర్ తో పాటు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు పది రోజుల నుంచి వరద నీరు బయటకు వెళ్లలేకపోయింది. ఖమ్మం జిల్లాను మున్నేరు వాగు ముంచెత్తింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో తమ శక్తి వంచన లేకుండా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కానీ ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతో చితికిపోయిన కుటుంబాలు బాగుపడతాయాన్న నమ్మకం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోయి రోదిస్తున్నప్పటికీ ఎంతో కొంత తమ ఖజానా పరిమితికి దాటకుండా సాయం అందించారు. కేంద్ర బృందాలతో కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించి హడావిడి చేసి వెళ్లిపోయారు. చివరకు తెలంగాణకు, 416.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 1,492 కోట్లు, మహారాష్ట్రకు 1,492 కోట్ల నిధులను మంజూరు చేయడం విమర్శలకు దారితీసింది. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు ఉన్నందునే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంది.