జీవో 111 వెనుక పెద్ద స్కామ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనినే కేసీఆర్ కూడా చేస్తున్నారు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం త్వరలోనే జరుగుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎన్నికల సంవత్సరంలోనే పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ పార్టీ నాయకత్వ మార్పుపై పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ప్రస్తుతం అలాంటి నిర్ణయాలు ఏమీ లేవని తెలిపారు. ప్రజలలో ఎవరికి ఆదరణ ఉంటుందో వారికే పట్టం కడతామని చెప్పుకొచ్చారు.
జీవో 111 రద్దు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న స్కామ్ అని ఈటల ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనినే కేసీఆర్ కూడా చేస్తున్నారు. నిషేధిత జాబితాలోని భూములను తమ అనుయాయులకు అప్పగించి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు ఈటల. ఆ బాటలోనే కేసీఆర్ కూడా పయనిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు తాగునీటి కోసమే కాకుండా హైదరాబాద్‌లో వరదలను అరికట్టాయని అన్నారు. అవి హైదరాబాద్‌లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయని.. హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మార్చడానికి మేము అనుమతించమన్నారు ఈటల. GO 111 హైదరాబాద్‌కు విపత్తు అని, దానిని అనుమతించకూడదని చెప్పుకొచ్చారు. ఈ జీవో కారణంగా రియల్ ఎస్టేట్ లాభపడుతుందని, ఎన్నికల కోసం కేసీఆర్ కు కావాల్సిన డబ్బులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.