జంట హత్యల కేసులో సంచలనం.. భార్య 'చివరి' కోరిక విని.. దారుణం

చివరిసారిగా ప్రియుడిని కలుస్తానని భార్య కోరడంతో సరేనన్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా చంపేశాడు.

Update: 2022-05-06 09:33 GMT

హైదరాబాద్ నగర శివారులో జరిగిన జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెంబడించి మరీ భార్య, ఆమె ప్రియుడు ఏకాంతంగా ఉన్న సమయంలో హత్య చేసినట్లు చెప్పినదంతా అబద్ధమని తేలింది. భర్త, భార్య, ఆమె ప్రియుడు ముగ్గురూ కలిసే నగర శివారుకి వెళ్లినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఊరొదిలి వెళ్లిపోతుండడంతో చివరిసారి ప్రియుడిని కలిసేందుకు ఒప్పుకున్నట్టే నటించి.. వారిద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో భర్త ఒక్కసారిగా దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.

విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన శ్రీనివాసరావుకి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఐదుగురు పిల్లల్లో ఇద్దరికి వివాహం కాగా మరో ముగ్గురు విజయవాడలోనే నానమ్మ వద్ద ఉంటున్నారు. గతేడాది శ్రీనివాసరావు తన భార్యతో కలిసి హైదరాబాద్‌కి వలసొచ్చాడు. తొలుత పార్శీగుట్టలో ఉన్న శ్రీనివాసరావు దంపతులు ఆరు నెలల కిందట వారాసిగూడకి మకాం మార్చారు.

పార్శీగుట్టలో ఉంటున్న సమయంలోనే భార్యకి  బౌద్ధనగర్‌కి చెందిన క్యాబ్ డ్రైవర్ యశ్వంత్ అలియాస్ బన్నీతో పరిచయమైంది. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త లేని సమయంలో ఇంట్లోనే ఇద్దరూ రాసలీలలు సాగించారు. ఆ విషయం శ్రీనివాసరావుకి తెలియడంతో భార్యను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా ప్రియుడితో శారీరక సంబంధం కొనసాగించింది. దీంతో విజయవాడ వెళ్లిపోతే వారిద్దరూ కలిసే అవకాశం ఉండదని భావించిన శ్రీనివాసరావు వారం రోజుల కిందటే సామాన్లు పంపించేశాడు.

భార్యాభర్తలిద్దరూ బైక్‌పై విజయవాడ వెళ్లాలని భావించారు. అయితే చివరిసారిగా తన ప్రియుడు బన్నీని కలుస్తానని భార్య చెప్పడంతో రగిలిపోయాడు. ఒప్పుకున్నట్టే నటించి అతన్ని ఇంటికి రప్పించాడు. నగర శివారులో ప్రియుడితో కలవమని.. అటు నుంచి అటే విజయవాడ వెళ్లిపోదామని నమ్మించాడు. భార్యను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. అది నమ్మేసిన బన్నీ వారిని అనుసరించాడు. దారిలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నారు. కొత్తగూడ బ్రిడ్జి వద్దకు వెళ్లిన తర్వాత బైక్‌లు రోడ్డు పక్కన ఆపి చెట్ల పొదల్లోకి వెళ్లారు.

భార్య తన ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లగా శ్రీనివాసరావు మద్యం తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న శ్రీనివాసరావు ఇద్దరూ నగ్నంగా ఉండగా ఒక్కసారిగా దాడి చేసి చంపేశాడు. తలపై బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. స్క్రూ డ్రైవర్‌తో పొడిచి పొడిచి కసి తీర్చుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విజయవాడ పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా పడి ఉన్న మృతదేహాల వ్యవహారం వెలుగుచూసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News