డీజీపీ కార్యాలయంలో స్పెషల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లాపై..

Update: 2023-07-27 11:26 GMT

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సహాయ, పునరావాస కార్యక్రమాలపై సలహాలు, సూచనలు, సహాయాన్ని అందించేందుకై డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ కార్యక్రమాలను డీజీపీ అంజనీ కుమార్ తో సహా అదనపు డీజీ లు శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్ లతోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నైనా రహదారులు, దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడితే శాటిలైట్ ద్వారా పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకై తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లాపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. డీజీపీ కార్యాలయం నుండి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గురువారం ఉదయం వరకూ 2900 మందిని రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రంకు తరలించామని, మోరంచపల్లి గ్రామంలో వరదలకు చిక్కుకున్న వారిని 6 NDRF టీమ్ తో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని వివరించారు. అత్యవరసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ మూడు కమిషనరేట్ లలో పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ తెలిపారు.
ముసారాం బాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా వరద నీరు కంట్రోల్ లో ఉందని చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్ఫీ లు తీసుకోవడానికి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారన్న డీజీపీ.. సెల్ఫీ లు తీసుకోవడానికి జలపాతాలు, మత్తడి పోస్తున్న చెరువులు, పారుతున్న కాలువల వద్దకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండేవారు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 24 గంటలుగా డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News