Summer : అల్లాడిస్తున్న ఎండలు..ఈ సమ్మర్ మాత్రం సీన్ సితారేనట
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదటి వారం నుంచే దంచేస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటే అవకాశముందని కూడా చెబుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
రానున్న నాలుగు రోజులు...
ిఇక రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మళ్లీ ఐదారు రోజులు చల్లబడినా మళ్లీ వాతావరణం వేడెక్కుంతుందని పేర్కొంది. నిన్న ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు కూడా రోడ్ల మీదకు రావడానికి భయపడిపోతున్నారు. రాత్రి వేళ ఉక్కపోత తప్పడం లేదు. ఉదయం ఎనిమిది గంటల వరకూ మాత్రమే చల్లని గాలులు వీస్తున్నాయి. తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫ్యాన్‌లు, ఏసీల వినియోగం కూడా ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగింది.
హైదరాబాద్ లో....
హైదరాబాద్ లో నిన్న 38.4 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో ఈ రకమైన వాతావరణం ఉందని నిపుణులు సయితం చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఎండల తీవ్రత మామూలుగా లేదు. పగటి ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా హెచ్చరికలు వినిపిస్తున్నాయి.