Bhadradri : భద్రాద్రి రామయ్య కల్యాణానికి చీరాల నుంచి తలంబ్రాలు
భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి తలంబ్రాలు తీసుకువస్తున్నారు.;

భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి తలంబ్రాలు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని చీరాల నుంచి పది టన్నుల గోటి తలంబ్రాలను తయారు చేసి తీసుకు వస్తున్నారు. కల్యాణంలో అతి పవిత్రంగా భావించే వాటిలో తలంబ్రాలు ముఖ్యం. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియోగించడం భారతీయ సంప్రదాయంలో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో భద్రాద్రిలో ఏటా జరిగే సీతారాముల కల్యాణానికి ఈ గోటి గిన తలంబ్రాలను తయారు చేసి తీసుకువస్తుంటారు.
భక్తి శ్రద్థలతో...
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి గడచిన పదకొండేళ్లుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. కల్యాణం మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు.