Revanth Reddy : అసెంబ్లీలో గ్యారంటీలపై ప్రకటన ఉంటుందా? గుడ్ న్యూస్ చెబుతారా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది

Update: 2024-12-16 06:16 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అనేక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షి గా ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలపై ప్రకటన చేయనున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాల పేరిట రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. రైతు భరోసా నిధులను సంక్రాంతికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఆ విషయంపై స్పష్టత వచ్చింది. దానికి సంబంధించిన చర్చఈ సమావేశాల్లో జరిగే అవకాశమున్నప్పటికీ ఇప్పటికే సంక్రాంతి తర్వాత అని చెప్పడంతో ఇక దాని గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఇక మిగిలిపోయిన గ్యారంటీల విషయంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయినట్లు చెబుతున్నారు.

అమలు చేయాల్సిన గ్యారంటీల…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన గ్యారంటీలను పక్కన పెడితే.. అమలు చేయాల్సిన వాటిపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే అంశంపై కూడా ఈ సమావేశాల్లో రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చేఛాన్స్ ఉందని తెలిసింది. బతుకమ్మ చీరల పంపిణీ జరపలేదన్న విమర్శల నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి శాసనసభలో ఒక తేదీని రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఏడాది నుంచి మహిళలు నెలకు తమకు ఇస్తామన్న 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో వారిని ఆకట్టుకునేందుకు ఖచ్చితంగా రెండో ఏడాది ఆరంభంలో ప్రకటన ఉంటుందని అధికారిక వర్గాలు కూడా వెల్లడించాయి. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్ననేపథ్యంలో మహాలక్ష్మి పధకం కింద మహిళలకు ఇచ్చే నగదు విషయంలో ఈ సమావేశంలో స్పష్టతను ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ అంశాలపై కూడా…
మరోముఖ్యమైన అంశం హైడ్రాను మరింత బలోపేతం చేయడంపై కూడా ప్రకటన ఉండనుంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో బిల్లను కూడా శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాల్లో స్పష్టత ఇవ్వనున్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లేందుకే సిద్ధమయిన ప్రభుత్వం నష్టపోయిన వారికి, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారాన్ని కూడా అందచేసే విషయంలో స్ఫష్టమైన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు లగచర్ల అంశంతో పాటు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలోనూ చర్చ జరిగే అవకాశమున్నందున ఈ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటనలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతన్నాయి. మొత్తం మీద నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అనేక కీలక ప్రకటనలకు వేదికగా మారనున్నాయన్నది అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన మ్యానిఫేస్టోల అమలుపై కూడా ప్రకటన చేయనున్నారు.


Tags:    

Similar News