Cold Waves : తెలంగాణలో వణికిపోతున్న జనం.. బయటకు రావాలంటేనే భయం
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు.
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ చలి తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతాల వరకూ చలి వణుకుపుట్టిస్తోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి మరీ నిద్రపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో చలికి అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని, ఆసుపత్రుల్లో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
పొంచిఉన్న ముప్పు...
ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారు, చిన్నారులు చలి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రల్లో ఎక్కువ మంది ఈ రకమైన వ్యాధులతోనే చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే న్యుమోనియా వంటి వ్యాధిన పడే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బయటకు వచ్చేటప్పుడు మంకీ క్యాప్ లు, స్వెటర్లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చేతులు కూడా గడ్డకట్టుకపోయే పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలను నడపటం సాధ్యపడటం లేదు.
సింగిల్ డిజిట్ కు...
ఆదిలాబాద్ లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో 8.5 డిగ్రీలు, మెదక్ 10.8, నిజామాబాద్ లో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ పదిహేడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూచలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అస్తమా రోగులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ప్రజలు చలి నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వైద్యులు, అటు అధికారులు సూచిస్తున్నారు.