Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్య విషయాలపై కేబినెట్ నేడు చర్చించనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు ఆదాయ వనరులు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించే అవకాశముందని తెలిసింది.
రైతు రుణమాఫీకి...
రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికపై మంత్రుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సలహాలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీపై అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి వచ్చారు. దీంతో పాటు లిక్కర్ ధరలు, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపుదలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.