Telangana Cabinet : నేడు మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాల దిశగా
తెలంగాణ కేబినెట్ నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ లో ఆరు గ్యారంటీల అమలుపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం వాటి అమలు తీరు తెన్నులపై చర్చించనుంది. దీంతోపాటు మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, 2,500 రూపాయల ఆర్థిక సాయం పై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
జనంలోకి వెళ్లేందుకు...
పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే ఈ హామీలను అమలు చేసి జనంలోకి వెళ్లి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే అవకాశముంది. దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను న్యాయస్థానం ఆదేశించిన మేరకు మరోసారి పేర్లను గవర్నర్ కు పంపనున్నారు. అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలతో పాటు, 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో పాటు అనేక నిర్ణయాలను కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని తెలిసింది.